ఓట్ చోర్ కాంగ్రెస్సే..భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశారు: రాంచందర్ రావు 

ఓట్ చోర్ కాంగ్రెస్సే..భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశారు: రాంచందర్ రావు 
  • విదేశీయులను రప్పించి దేశ ప్రతిష్టకు భంగం కలిగించారు
  • సోరోస్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దేశంలో కుట్రలకు యత్నం
  • రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, అసలు ఓట్ చోర్, సంవిధాన్ చోర్ ఆ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానించి, దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ ఆల్ సెల్స్ నేతల సమావేశం జరిగింది.

దీనికి చీఫ్ గెస్టుగా రాంచందర్ రావు హాజరై, మాట్లాడారు. పెట్టుబడుల సదస్సు పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిగ్ వర్కర్లు ఎవరూ కనిపించలేదని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీయుల జోక్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రతినిధి ‘ఓట్ చోర్, గద్దీ చోర్’అంటూ వ్యాఖ్యానించడం మన ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమాధికారాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.

అమెరికా వంటి దేశాల్లో విదేశీయులు అంతర్గత రాజకీయాలపై మాట్లాడితే అనుమతించరని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెడ్ ఎకానమీ అని అవమానించడమే కాకుండా, ఇప్పుడు విదేశీయులను పిలిపించి దేశ వ్యతిరేకంగా మాట్లాడించడం దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. మోదీని వ్యతిరేకిస్తే ప్రజాస్వామ్యంలో సహిస్తాం.. కానీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై బీజేపీ తరఫున తగిన వేదికలపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

సోరోస్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కుట్రలు.. 

సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 350 మంది విదేశీ ప్రతినిధులు రావాల్సి ఉండగా 115 మందే వచ్చారని, భారత వ్యతిరేక వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్ సహా మిగిలిన వారికి కేంద్రం చివరి నిమిషంలో వీసాలు రద్దు చేయడం సరైన నిర్ణయమని రాంచందర్ రావు సమర్థించారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వొద్దని 63 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేసి అమెరికా అధ్యక్షుడికి లేఖ రాసిన విషయాన్ని శశిథరూర్, కాంగ్రెస్ నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

జాతీయవాద ప్రభుత్వాలను కూల్చివేస్తానని ప్రకటించిన జార్జ్ సోరోస్ నిధులతో నడిచే ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను ఈ సదస్సుకు రప్పించారని ఆరోపించారు. 2014 తర్వాత ప్రజాస్వామ్యం లేదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అత్యధిక మద్దతు ఉన్నా.. నెహ్రూ ప్రధాని కావడమే మొదటి ఓటు చోరీ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశంపై భారత్ వాణినివినిపించడానికి ప్రతిపక్ష నేత వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయిని పంపారని, ఇందిరా, రాజీవ్, మన్మోహన్ సింగ్ ఏనాడూ విదేశాల్లో దేశ ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడలేదని గుర్తుచేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సెల్స్ సిద్ధం కావాలి..

పార్టీ నిర్మాణంలో వివిధ సెల్స్ ఎంతో కీలకమని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వీటి పనితీరుకు ప్రాధాన్యతనిస్తారని రాంచందర్ రావు తెలిపారు. జాతీయ స్థాయిలో 22 అధికారిక సెల్స్ ఉన్నాయని, రాష్ట్రంలో అవసరాన్ని బట్టి మరో ఐదారు సెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎక్స్-సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్, అడ్వకేట్స్, ట్రేడర్స్, ఐటీ, సోషల్ మీడియా, టీచర్స్, ఎడ్యుకేషన్, డాక్టర్స్, కల్చరల్ సెల్ ద్వారా వృత్తి నిపుణులను, మేధావులను పార్టీతో అనుసంధానించాలని సూచించారు. ఆఫీస్ బేరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్నంత ప్రాముఖ్యత సెల్స్ కన్వీనర్లకు ఉంటుందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సూచనల మేరకు ఓటర్ల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.